అన్నమయ్య కీర్తనలలో మేలిమి బంగారం ఈ కీర్తన
బౌళి రాగం లో చేసిన ఈ కీర్తన చెవులకు ఇంపు ను మనసుకు హాయిని ఇస్తుంది.
బౌళి రాగం భూపాల రాగానికి దగ్గరగా ఉంటుంది.
అందుకే ఈ రెండింటిని ఉదయ రాగాలు అంటారు.
పాట
జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు
వెగటునాసోదంబు ఇది నీవెలితో నావెలితో
యెన్నిమారులు సేవించిన కన్నులూ తనియవు
విన్ననీకథామృతమున వీనులు తనియవు
సన్నిధిని మిమ్ము నుతియించి సరుస జిహ్వయు తనియదు
విన్న కన్నది కాదు ఇది నావెలితో నీవెలితో
కడగి నీప్రసాదమే కొని కాయమూ తనియదు
బడి ప్రదక్షిణములు సేసి పాదములు నివి తనియవు
నుడివి సాష్టాంగంబు చేసి నుదురునూ తనియదు
వెడగు(దన మిది గలిగె నిది నావెలితో నీవెలితో
చెలగి నిను నే పూజించి చేతులూ తనియవు
చెలువు సింగారంబు తలచి చిత్తమూ తనియదు
అలరి శ్రీ వేంకటగిరీశ్వర ఆత్మ నను మోహించజేసితి
వెలయ నిన్నుయు దేరె మును నీవెలితో నావెలితో
వెగటునాసోదంబు-వెగటు +అసోదంబు
అసోదంబు-మనిషికి పారవశ్యం కలిగినప్పుడు
శరీరం లో కొన్ని మార్పులు జరుగుతాయి.
మనసులో కలిగిన ఈ పారవశ్యమే శరీరమంతా
పులకిస్తుంది. ఈ పారవశ్య భావం ఎవరికి వారు
అనుభవించాలే గాని,ఇలా ఉంటుందని చెప్పలేము
దీనినే ఆసోదము అంటారు.
వెలితి అంటే లోపము.
భావము
ఓ దేవ దేవా నీవు జగన్మోహనాకారుడవు(ముల్లోకములను మోహింప జేయ గల సౌందర్య రూపము గల వాడవు),
చతురుడవు(సమయ స్ఫూర్తి తో శత్రువులను అణచిన వాడవు), వేదములు ఘోషించే మహానుభావుడవు.
కానీ నిన్ను చూడగానే నాలో కలిగే మార్పులు కొద్దిగా వెగటు గా అనిపిస్తూ ఉంది.
మరి అది నా లోపమో మరి నీ లోపమో తెలియకుండా ఉంది.
కానీ ఒక్కటి మాత్రము నిజము.
నిన్ను యెన్ని మారులు సేవించినా నా కన్నులకు తనివి తీరటం లేదయ్యా.
నీ కథామృతాన్ని ఎంత విన్నా నా చెవులకి తృప్తి కలగటం లేదయ్యా.
మీ సన్నిధిలో మిమ్మల్నెంత నుతించినా కూడా నా నాలుకకు తనివి తీరటం లేదే.
నీ లీల ఎంత కనినా, ఎంత వినినా తనివి తీరదు.
ఇది నా వెలితో నీ వెలితో తెలియరావటం లేదు.
నీ ప్రసాదాన్ని పొంది కూడా నా శరీరం తృప్తి చెందటం లేదు.
నీ చుట్టూ ప్రదక్షిణలు చేసి చేసి నా పాదాలూ తనియటం లేదే.
నీకు సాష్టాంగ నమస్కారాలు చేసి చేసి కూడా నా నుదుటికి తనివి తీరటం లేదయ్యా.
నా ఈ వింత ప్రవర్తన కొందరికి వెడగుదనం (వికారం) గా అనిపిస్తుంది.
ఇది నా వెలితో నీ వెలితో తెలియట్లేదే.
నిన్ను పూజ చేసి చేసిన నా యీ చేతులూ తనివినొందటం లేదే.
నీ సుందరమైన అలంకారములను తలచుకొని కూడా నా చిత్తమూ తనివినొందటం లేదే.
ఓ వేంకటేశ్వరా నా ఆత్మనూ నన్నూ మోహింపచేసితివి.
మునుపే ఇవన్నియు తెలియవచ్చినవి.
కారణం, నీ వెలితో నా వెలితో తెలియరావటంలేదే,తెలియ జేయవయ్యా