తూరుపు సిందూరపు మందారపు వన్నెలలో
ఉదయ రాగం హృదయ గానం
కోయిల కుహు రాగాలతో మెలుకువ అయింది.
లేచి కూర్చున్నాను. గడియారం వంక చూస్తే సమయం ఉదయం 6.00 గంటలు కావస్తున్నది.కిటికీ లో నుండి వస్తున్న పిల్ల తెమ్మెరలు,ఆ గాలికి ఆడుతూ కిటికీ తెరలకు కట్టిన గంటలు మధుర స్వనం చేస్తున్నాయి. లేచి కిటికీ తెరలు తెరచి చూసాను.
చెరువు గట్టు మీద పశువులను పొలాలకు తీసుకెళ్తున్నారు.పైకి లేచిన గోధూళి, మంచు తెరలు తొలి సంజె కెంజయ లేత కిరణాలతో కలిసి కొత్త రంగులీని వింత సోయాగాలనిస్తూంది.
రామాలయం నుండి బాల మురళి గారు పాడిన పిబరే రామరసం పాట లీలగా వినిపిస్తూంది. అహిర్ భైరవ్ రాగంలో ఉన్న ఈ పాట వింటుంటే
ఎంత అనునాదామో(resonance)
పశువుల మెడ గంటలు చేసే సవ్వడులు (అహిర్ అంటారట), ఒక సంగీత కారుడు ఆ పాటకు లయ బద్దంగా చేస్తున్న తాళం లాగా వినిపిస్తూంది.
ఒక వైపు కోయిల కుహు కుహులు, ఇంకొక వైపు బాల మురళీ గానం మరొక వైపు ఒక చిత్రకారుడు వేసినట్లున్న ప్రకృతి అందాలు.
ఇంత ఆనంద మయ సందర్భం అరుదు గా వస్తుందేమో, నేను కిటికీ దగ్గర అలానే నిలబడి
ఆ రసమయ క్షణాలను ఆస్వాదిస్తున్నాను.
ఈ సుందర దృశ్యాలను,మనసు అనే కెమెరా తో క్లిక్ చేసి,పదిలంగా దాచుకున్నాను.
వెంటనే నాకు చక్రవాక రాగం ( హిందూస్థాని అహిర్ భైరవ్ రాగము కర్ణాటక సంగీతంలో చక్రవాకం) స్ఫురణకు వచ్చి
నా దగ్గర ఉన్న ఈ పాట record ను play చేసి
వింటున్నాను.
ఆత్రేయ గారు సంగీతం గురించి ఎంత చక్కగా వ్రాసారో.
అహిర్ భైరవ్ రాగాన్ని ఉదయ రాగం అని అందుకే అంటారేమో. వింటుంటే తనువు మనసు రెండూ పులకించి పోయి నా హృదయం గానం చేస్తున్న భావన.
నాకు ఎప్పుడో చదివిన ఈ మాటలు గుర్తుకు వచ్చాయి.
మనిషికి పాట తోటి అనుబంధం అనవరతమైంది,అవిభాజ్యమైంది.
మనిషికి పని ఎంత ముఖ్యమో
పాట కూడా అంతే ముఖ్యమనది